ఒడిదుడుకుల మార్కెట్‌ | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల మార్కెట్‌

Published Wed, May 1 2019 12:41 AM

Nifty forms Dragonfly Doji, must top 11,770 to end consolidation  - Sakshi

చివరిదాకా తీవ్రమైన ఒడిదుడుకులకు గురైన  మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ 30 శాతం వరకూ పడిపోవడం, ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమనడం... ప్రభావం చూపించాయి. చివరి గంటలో లోహ, ఐటీ, అయిల్, గ్యాస్‌  షేర్లలో కొనుగోళ్లు జరగడం, డాలర్‌తో రూపాయి మారకం 46 పైసలు బలపడటంతో నష్టాలు చాలా వరకూ తగ్గాయి. స్టాక్‌ సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనైనా సెన్సెక్స్‌ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్లు ఎగువనే ముగిశాయి. రోజంతా 353 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 36  పాయింట్లు తగ్గి 39,032 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7 పాయింట్లు పతనమై 11,748 పాయింట్ల వద్ద ముగిశాయి. టెలికం, రియల్టీ, వాహన, బ్యాంక్‌ షేర్లు పతనమయ్యాయి.
 
ఇంట్రాడే నష్టం 314 పాయింట్లు 
17వ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముంబైలో పోలింగ్‌ జరిగడంతో  సోమవారం స్టాక్‌ మార్కెట్‌ పనిచేయలేదు. మూడు రోజుల సెలవుల అనంతరం మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ నష్టాలతో ఆరంభమైంది. ఆ తర్వాత ఒడుదుడుకులు తీవ్రమయ్యాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 314 పాయింట్లు నష్టపోయింది. యస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,500 కోట్ల మేర నికర నష్టాలు ప్రకటించడం, అనిల్‌ ధీరుభాయ్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రెండు ఆర్థిక రంగ కంపెనీల క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గడం వంటి కారణాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో యస్‌ బ్యాంక్, హీరో మోటొకార్ప్‌ షేర్లు, లిక్విడిటీ సమస్యలుంటాయనే ఆందోళనతో రియల్టీ షేర్లు పతనమయ్యాయి. ఎన్‌బీఎఫ్‌సీలు, కొన్ని కార్పొరేట్‌ గ్రూప్‌ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా తాజా మొండి బకాయిలు మరింతగా పెరుగుతాయనే ఆందోళనతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు క్షీణించాయి.  

►హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిన ఎదుర్కొన్నాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 6 శాతం వరకూ పడిపోయాయి.  
► చెర్‌వెల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, 1,190 ని తాకింది.చివరకు 4 శాతం లాభంతో రూ.1,183  వద్ద    ముగిసింది. 

30 శాతం పతనమైన  యస్‌ బ్యాంక్‌ 
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,507 కోట్ల నికర నష్టాలు రావడంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ భారీగా పతనమైంది. ఇంట్రాడేలో 30 శాతం నష్టపోయిన ఈ షేర్‌ చివరకు 29 శాతం నష్టంతో రూ.168 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా నష్టపోయిన షేర్‌ ఇదే. బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.16,049 కోట్లు హరించుకుపోయి రూ.38,909 కోట్లకు పరిమితమైంది. గత క్యూ4లో రూ.1,507 కోట్ల నికర నష్టాలు వచ్చాయన్న కారణంగా ఈ షేర్‌ పతనం కావడంతో ఒక్క రోజులోనే ఈ నష్టాలకు పదిరెట్లకు ఎక్కువగా రూ.16,000 కోట్ల మేర మార్కెట్‌ విలువ హరించుకుపోవడం విశేషం.   

మార్కెట్‌కు నేడు సెలవు   
మహారాష్ట్ర దివస్‌ సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు.  బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు.

 

   

Advertisement
Advertisement